Sunday, December 16, 2012

ఒక పౌష్టికాలోచన!


కొత్త పౌష్టికాహారం వచ్చిందనగానే... చూడ్డానికి వెయ్యి కళ్లొస్తాయి. కొనడానికి పది చేతులు వస్తాయి. అది రెడీమేడ్ ఫుడ్ అయితే మరీ మంచిది. ఎందుకంటే మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల మనిషి రోజురోజుకీ నీరసించిపోతున్నాడు. రకరకాల కారణాల వల్ల ప్రకృతి ఇచ్చే పౌష్టికాహారాన్ని పొందలేకపోతున్నాడు. దీంతో బోలెడన్ని అంతర్జాతీయ వ్యాపారసంస్థలు పొడులరూపంలో రకరకాల ఆహారపదార్థాలను తయారుచేసి మార్కెట్‌లో పెడుతున్నాయి. వీటికి బోలెడు గిరాకి. కాని డబ్బున్నవారికే ఇవి అందుబాటులో ఉంటాయి. మరి పేదల సంగతేంటి? వీరి గురించి ఎవరూ ఆలోచించకపోయినా...నిజామాబాద్‌లో ఉండే ఒక గృహిణి ఆలోచించింది. అన్ని వర్గాలవారికీ అందుబాటులో ఉండే పౌష్టికాహారం తయారుచేసింది. అంతేనా... పేద ప్రజల ముంగిట్లో నిలబడి వాటినెలా తయారుచేసుకోవాలో కూడా వివరిస్తోంది. ఆ వివరాలు...

రోజూ మనం తినే తిండిలో ప్రకృతి నుంచి వచ్చే అన్ని రకాల ఆహారపదార్థాలు ఉండటం లేదు. అందుబాటులో లేక, ఒక వేళ ఉన్నా...ఉపయోగించుకునే విధానం తెలియక పౌష్టికాహారానికి దూరమవుతున్నాం. పేదలే కాదు మధ్యతరగతివారు సైతం ఏదో ఒకటి తిని...వారికున్నదానితో సరిపెట్టుకుంటున్నారు. మనకు అందుబాటులో ఉన్న పదార్థాలతోనే చక్కని పౌష్టికాహారం తయారుచేసుకుంటే ఎలా ఉంటుంది? అని ఆలోచించిన శ్రీదేవికి మొదట్లో ఇన్ని విషయాలు తెలియవు. ఎందుకంటే ఆమె చదివింది పదో తరగతే. పుట్టి పెరిగింది పల్లెటూర్లో. అయినా అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులకు ధీటుగా పౌష్టికాహారం తయారుచేస్తోంది.

సత్తిపిండితో మొదలై...
జొన్నలు, శెనగపప్పుతో చేసే జావని నిజామాబాద్ వాసులు సత్తిపిండి అంటారు. తన చిన్నప్పుడు అమ్మపెట్టిన సత్తిపిండిని గుర్తుచేసుకుని ఆ పదార్థాలతో కొత్తరకం న్యూట్రిషన్ పౌడర్ తయారుచేసింది శ్రీదేవి. ఆ ఆలోచన ఎలా వచ్చిందంటే "మా వారు చంద్రమౌళి శర్మ, జ్యోతిష్యం చెబుతారు. మాకు ఇద్దరు పిల్లలు. 2004లో ఒకసారి ఆయన ఏదో పనిమీద నెలరోజులు టూర్ వెళ్లారు. ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను.

ఆ సమయంలో నాకు వచ్చిన ఆలోచన ఈ న్యూట్రిషన్ ఫుడ్. చిన్నప్పుడు అమ్మ పెట్టిన సత్తిపిండిలో రెండే పదార్థాలు ఉండేవి. కాని నేను పది రకాలు వేసి దాన్ని మరింత బలవర్ధకంగా చేయాలనుకున్నాను. రాగులు, జొన్నలు, మినుములు, పెసలు, బెల్లం, ఐదు రకాల డ్రైఫ్రూట్స్ కలిపి పొడి తయారుచేశాను. నిజామాబాద్‌లో మేముండే వినాయక్‌నగర్‌లో ఒక సూపర్‌మార్కెట్‌కి తీసుకెళ్లి చూపించాను. వారికి బాగా నచ్చింది. రకరకాల సైజుల్లో ప్యాకింగ్ చేసి ఇమ్మన్నారు. నా పొడికి గిరాకి బాగా ఉందని చెప్పడంతో నాకు ధైర్యం వచ్చింది. చిన్నస్థాయి కుటీర పరిశ్రమ నెలకొల్పాలనుకున్నాను'' అని చెప్పారు శ్రీదేవి.

శ్రీదత్తా న్యూట్రిషన్స్...
ఏదైనా వస్తువు తయారుచేయడం ఒక ఎత్తు, దాన్ని మార్కెట్‌లో అమ్మి లాభాలను గడించడం మరో ఎత్తు, రెండు విషయాల్లో నూ శ్రీదేవి కొత్త పద్ధతిని అనుసరించింది. "నేను తయారుచేసిన సత్తిపిండికి గిరాకీ పెరగడంతో 2005లో ఇంట్లోనే ' శ్రీదత్తా న్యూట్రిషన్స్' అనే సంస్థని పెట్టి పెద్ద మొత్తంలో పౌష్టికాహారాన్ని తయారుచేయడం మొదలుపెట్టాను. చిన్న చిన్న ప్యాకెట్లు తయారుచేసి రోడ్డు పక్కన ఉండే పండ్ల దుకాణాల్లో పెట్టాను. ప్రతీ ప్యాకెట్టుకీ ఒక చిన్న కరపత్రం జోడించాను. అందులో ప్రాడక్ట్ వివరాలు, ప్రయోజనాలు, నా అడ్రసు ఇచ్చి ఏవైనా సలహాలు ఇమ్మని రాశాను. పండ్లు కొనడానికి వచ్చిన వారికి ఒక్కో ప్యాకెట్టు ఉచితంగా ఇచ్చేవారు. అలా పంచినందుకు ఆ పండ్లదుకాణాలవారికి కొంత డబ్బు ఇచ్చేదాన్ని.

వ్యాపార మెళకువలు...
ఒకరోజు ఇంటికి లెటర్ వచ్చింది. ఎవరో లెక్చరర్ రాశారు. ' నేను మీ న్యూట్రిషన్ పొడిని కొనుక్కున్నాను. చాలా బాగుంది. మార్కెటింగ్ చేసే విధానం మెరుగుపడాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రొడెక్టవిటీ కౌన్సిల్‌లో శిక్షణ తీసుకుంటే బాగుంటుంది' అని రాశారు.

వెంటనే నేను అక్కడికి వెళ్లాను. అక్కడ శ్రీనివాస్ రఘు అనే ఆఫీసర్ని కలిసాను. వ్యాపార మెళకువలలో ఓ పది రోజులు శిక్షణ తీసుకున్నాను. అక్కడ వారు చెప్పిన పాఠాలు నా సంస్థ అభివృద్దికి చాలా ఉపయోగపడ్డాయి. ఆ తరువాత శ్రీనివాస్‌గారి సలహాతో జాతీయ పోషకాహార సంస్థ వారి పుస్తకాలు చదివాను. చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. వయసుని బట్టి, అవసరాన్ని బట్టి పౌష్టికాహారం తయారుచేయాలని అర్థమైంది'' అని చెప్పారు శ్రీదేవి.

ఎన్ని రకాలు...
ప్రస్తుతం శ్రీదేవి దగ్గర పద్దెనిమిది రకాల పౌష్టికాహారాలు ఉన్నాయి. చిన్న పిల్లలకు పట్టే ఉగ్గు దగ్గర నుంచి పండు ముసలివారికి ఇవ్వాల్సిన ఆహారం వరకూ రకరకాల పొడులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని లడ్డూల రూపంలో కూడా ఉంటాయి.

నెలల వయసున్న పిల్లలకు, మూడేళ్ల వయసువారికి, పదిహేనేళ్ల వయసువారికి, పాతికేళ్ల వారికి, నలభైఏళ్లవారికి, యాభై దాటిన వారికి, డెబ్బైదాటిన వారికి, శారీరక వికలాంగులకి, మానసిక వికలాంగులకి, గర్భిణీ స్త్రీలకు...ఇలా ఒక్కో వయసువారికి ఒకో రకం పొడి తయారుచేస్తారు. జిమ్‌లకు వెళ్లేవారికి, బిపీ, షుగర్‌లతో ఇబ్బందిపడేవారికి కూడా ప్రత్యేకంగా పొడులు తయారుచేస్తున్నారు. వీటన్నిటినీ ఆంధ్రప్రదేశ్ ఆహార సంస్థ పరీక్షించింది. ల్యాబ్ టెస్ట్ చేసి అందులో ఉన్న పౌష్టిక విలువల గురించి అధ్యయనం చేసి గుర్తింపునిచ్చింది. దాంతో శ్రీదేవి పనిని పెద్ద పెద్ద సంస్థలు సైతం గుర్తించాయి.

రాష్ట్రం దాటిన పాఠాలు...
'శ్రీ దత్తా న్యూట్రిషన్స్' గురించి తెలుసుకున్న 'స్వదేశీ జాగరణ్‌మంచ్' అనే సంస్థ శ్రీదేవిని కేరళ తీసుకెళ్లింది. అక్కడ జరిగిన ఒక వర్క్‌షాప్‌లో పౌష్టికాహారం గురించి శ్రీదేవి ఇచ్చిన ప్రసంగాన్ని విని కేరళ ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే... మన రాష్ట్రంలో తాను చేస్తున్న పని గురించి చెప్పకుండా కేరళలో ఉండే ఆహార పదార్థాలతో పౌష్టికాహారం ఎలా తయారుచేసుకోవాలో వివరంగా చెప్పిందామె...

" కేరళకు వెళ్లే ముందే అక్కడి ఆహారం గురించి కొంత స్టడీ చేశాను. ఆహారం విషయంలో మనకీ, వారికీ చాలా తేడాలుంటాయి. అందువల్ల వారికి అందుబాటులో ఉండే ఆహార పదార్థాలతోనే పౌష్టికాహారం ఎలా తయారుచేసుకోవచ్చో కొన్ని ఉదాహరణలతో చెప్పాను. ప్రయోజనాలు కూడా వివరించాను. వాళ్లు చాలా సంతోషించారు. నిజానికి నేను చదువుకున్నది పదోతరగతే. ఇంగ్లీషు గొప్పగా రాదు. కాని నేను హాజరయిన వేదికలే నాకు ఆంగ్లం నేర్పించాయి. ఒకటి రెండు కాదు...హైదరాబాద్‌లో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఫ్యాప్సీ...లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో అడుగుపెట్టే అవకాశం వచ్చింది నాకు. నాకు తెలియని ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నాను'' అని గతం గుర్తుచేసుకున్నారామె.

పేదలకు శిక్షణ...
శ్రీ దత్తా న్యూట్రిషన్‌లో ఇప్పుడు ఎనిమిది మంది ఆడవాళ్లు పనిచేస్తున్నారు. అందులో ఇద్దరు వికలాంగులు. ఏటా ఎనిమిదిలక్షల రూపాయల వ్యాపారం జరుగుతోంది. నిజామాబాద్‌లో ఉన్న ఐదు 'శుభోదయ' పాఠశాలల్లోని పిల్లలకు పౌష్టికాహారం అందించే బాధ్యత ప్రభుత్వం శ్రీదేవికే అప్పగించింది. ఈ ఫుడ్‌ని కొనుక్కునే స్థోమత లేని పేదవారికి శ్రీదేవి ఉచితంగా శిక్షణ ఇచ్చి ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో చెబుతున్నారు.

నిజామాబాద్‌లోని ప్రతీ మండలంలోని రైతులందరికీ పౌష్టికాహారం తయారీ గురించి, ప్రయోజనాల గురించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. మొన్నటివరకూ మాటలతో వివరించిన ఆమె ప్రస్తుతం పవర్‌పాయింట్ ప్రజంటేషన్లు కూడా ఇస్తోంది. తయారి నుంచి మార్కెటింగ్ వరకూ అన్నింటా రాణిస్తున్న శ్రీదేవిని పలు సంస్థలు ప్రముఖ మహిళా పారిశ్రామిక వేత్తగా గుర్తించి సన్మానాలు చేశాయి. " నేను తయారుచేసిన పౌష్టికాహారం ప్రజలందరికీ అందాలి. మరీ ముఖ్యంగా వందల రూపాయలు ఖర్చుపెట్టి పౌష్టికాహారం కొనుక్కోలేని పేదప్రజలకి అందాలి. దానికన్నా ముందు వారికి ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల అవగాహన రావాలి. పదేళ్లుగా నిర్విరామంగా పనిచేస్తుంటే ఇప్పటికి మా జిల్లాలో కొందరికి పౌష్టికాహారం పట్ల కొంత అవగాహన వచ్చింది. ప్రతి ఒక్కరికి తెలియాలంటే నేను ఇంకా చాలా కష్టపడాలి. దీనికి కావాల్సిన సులభమార్గాలు వెతుక్కునే పనిలో ఉన్నాను'' అని చెప్పారు శ్రీదేవి.

ఇవి కాకుండా...
తాను తయారుచేసిన ఆహారం అమ్ముకుని నాలుగు రూపాయలు వెనకేసుకునే పనిలో ఉండకుండా .. శ్రీదేవి మరిన్ని కొత్త ఆవిష్కరణలకు ఆహ్వానం పలుకుతున్నారు. స్థూలకాయంతో బాధపడుతున్నవారికి నెల రోజుల కోర్సు ఒకటి ప్రారంభించారు. వారికి ప్రత్యేకమైన పొడులు తయారుచేసి ఇస్తున్నారు. అలాగే వారు రోజూ చేయాల్సిన వ్యాయామాలు, వారి దినచర్య గురించి శిక్షణ ఇస్తున్నారు. గర్భిణిస్త్రీలకు పౌష్టికాహారంతో పాటు మామూలు కాన్పు అవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఇంట్లోనే పాఠాలు చెబుతున్నారామె.

ఎన్ఐఎఫ్ గుర్తింపు...
జిల్లాకే పరిమితమైన తన పౌష్టికాహారానికి జాతీయస్థాయి గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు శ్రీదేవి. " నాకు తెలిసిన ఒక వ్యక్తి హనీబీ సంస్థ గురించి చెప్పారు. వెంటనే ఆ సంస్థ కోర్డినేటర్ బ్రిగేడియర్ గణేశంగారిని కలిశాను. నేను చెప్పిన వివరాలన్నీ విని శ్రీ దత్తా న్యూట్రిషిన్‌కి మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. నేషనల్ ఇన్నోవేషనల్ ఫౌండేషన్‌లో స్థానం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 25న కలవమని ఎన్ఐఎఫ్ నుంచి నాకు ఆహ్వానం వచ్చింది'' అని ఎంతో సంతోషంగా చెప్పారామె.

"ప్రస్తుతం శ్రీదేవి దగ్గర పద్దెనిమిది రకాల పౌష్టికాహారాలు ఉన్నాయి. చిన్న పిల్లలకు పట్టే ఉగ్గు దగ్గర నుంచి పండు ముసలివారికి ఇవ్వాల్సిన ఆహారం వరకూ రకరకాల పొడులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని లడ్డూల రూపంలో కూడా ఉంటాయి. వీటన్నిటినీ ఆంధ్రప్రదేశ్ ఆహార సంస్థ పరీక్షించింది. ల్యాబ్ టెస్ట్ చేసి అందులో ఉన్న పౌష్టిక విలువల గురించి అధ్యయనం చేసి గుర్తింపునిచ్చింది.''
ం భువనేశ్వరి ఫొటోలు: రతన్

No comments:

Post a Comment